Sermons

[3-9] < మత్తయి 7:21-23 > మన తండ్రి చిత్తమును విశ్వాసముతో నెరవేర్చగలము.< మత్తయి 7:21-23 >

‘‘ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ` ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు ` నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును.’’బహుశా ఆ వ్యక్తిని నేనే నేమో...


 • ‘ప్రభువా, ప్రభువా’ అని పిలుచు
 • ప్రతివాడు పరలోకరాజ్యములోనికి
 • ప్రవేశించునా?
 • లేదు. దేవుని చిత్తమును నెరవేర్చువారే
 • ప్రవేశించుదురు.


యేసు ఈ విధముగా తెలిపెను. ‘‘ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపబడడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును.’’ (మత్తయి 7:21) ఈ మాటలు అనేకులైన క్రైస్తవుల హృదయములలో భయము కలిగించును దానిని బట్టి వారు దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఎంతో ప్రయాసపడుదురు.

అనేకమంది క్రైస్తవులు పరలోకరాజ్యములో ప్రవేశించటానికి కేవలము ప్రభువైన యేసుక్రీస్తును నమ్మితే చాలు అనుకుంటారు. అయితే మత్తయి 7:21 ప్రకారం ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపబడడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.

ఈ వాక్యమును చదివిన అనేకులు ఆశ్చర్యపోతారు. ‘‘బహుశా ఆ వ్యక్తిని నేనే నేమో’’ అని భావిస్తారు. వారిని వారు సమర్థించుకోవటానికి ప్రయత్నిస్తారు. ‘‘ఇది నా గురించి కాదు, ఈ విషయాలు ప్రభువైన యేసు అవిశ్వాసులతో చెప్పియుండవచ్చు. ఇలాంటి అనేకమైన ఆలోచనలు వారి హృదయాలలో పరిభ్రమిస్తూ వుంటాయి.

కనుక వారు వెంటనే ఆ తరువాత భాగం చదువుతారు. ‘‘పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.’’ అప్పుడు వారు ‘‘నా తండ్రి చిత్తమును చేయువారు’’ అన్నమాటను పట్టుకుంటారు. మన తండ్రి చిత్తాన్ని దశమభాగాలు సక్రమంగా చెల్లిస్తూ, ఉదయకాల ప్రార్థనలు చేస్తూ, వాక్యాన్ని బోధిస్తూ, మంచి కార్యాలు చేస్తూ మరియు పాపం చేయకుండా ప్రయత్నిస్తూ.... నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వారిని చూస్తే నాకెంతో జాలి కలుగుతుంది. 

ఈ వాక్యమును అనేకులు సరిగా అర్థము చేసుకోక తప్పు చేస్తూ వుంటారు. దేవుని చిత్త ప్రకారం జీవించటమెలాగో ధ్యానించాలని మరియు దాని గురించి విశదంగా తెలియపరచాలని నేను భావిస్తున్నాను.

మొదటిగా తన కుమారుడు లోకపాపమంతయు తనపై మోపుకొని ప్రజలను వారి పాపభారమునుండి విడుదల చేయాలనేదే దేవుని చిత్తమైయున్నది అని తెలుసుకోవాలి.

ఎఫెసీ 1:5లో ఈ విధముగా తెలుపబడినది. ‘‘తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను.’’

అనగా మనము సత్యసువార్తను తెలిసికొని యేసుక్రీస్తు మన పాపములను శుద్దీకరించాడని యెరిగి తిరిగి జన్మించాలని అర్థమైయున్నది. మనము నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించి మన పాపములన్నియు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిపై ఆరోపించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇదే దేవుని చిత్తమైయున్నది.‘‘ప్రభువా! ప్రభువా!’’ అని పిలిచినంతమాత్రమున


 • యేసునందు విశ్వాసముంచగనే
 • మనము చేయవలసినదేమి?
 • తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చవలెను.


‘‘ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.’’ (మత్తయి 7:21)

తండ్రి చిత్తమును మనము రెండు విధములుగా అర్థము చేసుకొనవలయును. మొదటిది, మనము నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించి మన పాపములకు పరిహారము పొందుకోవాలి. రెండవదిగా, ఆ విశ్వాసాన్ని అనుసరించి మన తదుపరి కార్యక్రమాలు కొనసాగించాలి.

ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రజల పాపములను తొలగించాలన్నదే దేవుని చిత్తము. మన పూర్వికుడైన ఆదాము ద్వారా సైతాను పాపమును ప్రవేశపెట్టెను. అయితే దేవుని చిత్తము మానవులందరి పాపములను పరిహరించాలని కోరుకుంటుంది. మన తండ్రి చిత్తము కేవలము మనము దశమభాగాలను చెల్లిస్తూ, ఉదయకాల ప్రార్థనలు చేస్తూ ఉంటే సరిపోదు. కాని మనలను పాపము నుండి రక్షించాలన్నదే. దశమభాగాలు చెల్లించుట ప్రార్థనలు చేయుట అవసరమే అయితే మనము పాప ప్రక్షాళన చేసికొనుట మరింత ముఖ్యమైన విషయం. పాపపు సంద్రములో మునిగిపోతున్న మనలను రక్షించాలన్నదే దేవుని చిత్తము.

‘‘ప్రభువా, ప్రభువా’’ అని పిలుచు ప్రతివాడు పరలోకరాజ్యములో ప్రవేశించడని బైబిలు స్పష్టముగా తెలియపరచుచున్నది. అనగా కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచితే చాలదు గాని మన తండ్రి మననుండి ఏమి ఆశించుచున్నాడో మనము తెలుసుకొనవలయును. మనలను పాపము నుండి రక్షించాలని, తీర్పుపొంది నరకమునకు పోకుండా కాపాడాలనే తండ్రి చిత్తము. ఆదాము, హవ్వ నుండి మనకు సక్రమించిన పాపమునుబట్టి మన జీవితములు పాపభూయిష్టమై పోయాయి.దేవుని చిత్తము


 • దేవుని చిత్తమేమైయున్నది?
 • మనను పాపము నుండి విమోచించి ఆయన
 • పిల్లలుగా చేసుకోవాలన్నదే. దేవుని చిత్తము.


మత్తయి 3:15లో ఈ విధముగా తెలుపబడినది. ‘‘నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది.’’ దేవుని ప్రణాళికను నెరవేర్చటానికి ప్రభువైన యేసు ఈ లోకమునకు వచ్చి మనలనందరినీ పాపభారము నుండి కాపాడాడు. స్థానికుడైన యోహాను వలన ప్రభువైన యేసు బాప్తిస్మము పొందినప్పుడు దేవునియొక్క చిత్తము నెరవేర్చబడినది.

ఆయన మనలనందరినీ రక్షించి తన పిల్లలుగా చేసుకోవాలన్నదే ఆయన చిత్తము. దానిని నెరవేర్చటానికి, ఆయన కుమారుడు మనందరి పాపములను భరించ వలసివచ్చినది. సమస్తమైన ప్రజలను దేవుడు, తన పిల్లలుగా చేసికోవాలన్నదే ఆయన చిత్తము అందువలనే ఆయన తన సొంతకుమారుని ఈ లోకమునకు పంపి, సైతాను కబంధ హస్తములలో చిక్కుకున్న ప్రజలందరిని వారి పాపము నుండి విడిపించాడు. తన సొంతకుమారుని బల్యర్పణద్వారా మనలను ఆయన పిల్లలుగా చేసికొన్నాడు. ఇదే ఆయన చిత్తము.

యేసు బాప్తిస్మము పొంది సిలువ మీద చనిపోయినప్పుడు దేవుని చిత్తము నెరవేర్చబడినది. మన పాపములన్నియు యేసుక్రీస్తుపై ఆరోపింపబడుట ఆయన చిత్తమైయున్నది. యేసు బాప్తిస్మము పొంది, మనకు ప్రత్యామ్నాయముగా తీర్పుపొంది మనందరి అపరాధము నిమిత్తము సిలువపై మరణించాలన్నదే దేవునిచిత్తము.

‘‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.’’ (యోహాను 3:16) దేవుడు తన ప్రజలను పాపముల నుండి రక్షించెను. ఈ విధముగా రక్షించుటకు ప్రభువైన యేసు తన బహిరంగ పరిచర్యలో ప్రథమ భాగముగా స్థానికుడైన యోహాను వలన బాప్తిస్మము పొందెను.

‘‘యేసు `ఇప్పటికి కానిమ్ము; నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను.’’ (మత్తయి 3:15) యేసు ఈ లోకమునకు వచ్చి ఈ లోకపాపమంతయు ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా స్వీకరించి సిలువపైన మరణించి తిరిగి పునరుత్థానుడు కావాలన్నదే దేవుని చిత్తము.

ఈ విషయం మనం స్పష్టముగా తెలుసుకోవాలి. అనేకులు మత్తయి 7:21 ధ్యానించి మనము చనిపోవు పర్యంతం ఆయన సేవ చేయాలని మరియు మనకున్న వనరులను సంఘమును నిర్మించటానికి వెచ్చించాలని భావిస్తారు.

నా ప్రియ సహక్రైస్తవులారా, యేసునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరు మొట్టమొదటిగా దేవుని చిత్తమేదో గ్రహించాలి తరువాత దానిని నెరవేర్చాలి. ఆయన చిత్తము సరిగా గ్రహించక మిమ్మును మీరు సంఘమునకు అంకితం చేసుకుంటే ఉపయోగము లేదు.

పారంపర్య సంఘాలలో, అయ్యా మేము విశ్వాసముతో జీవించటం తప్ప మరేమి చేయగలము? అని ప్రశ్నిస్తారు. నేను ప్రెస్‌బిటేరియన్‌ సంఘములో కాల్విన్‌ మహాశయుని బోధను గురించి నేర్చుకున్నాను. నన్ను పెంచిన తల్లి ఎంతో మత భక్తి గల స్త్రీ మరియు ఆమె పాస్టరు గారికంటే అధికమైన జ్ఞానము గల వ్యక్తి. నా చిన్నతనములో పారంపర్య ఆచారముగల సంఘములో నేను అనేక విషయాలు నేర్చుకున్నాను.

అపోస్తులుడైన పౌలు కూడా తాను బెన్యామీను గోత్రికుడనని, గమలియేలు పాదముల వద్ద విద్యను అభ్యసించానని ఎంతో గర్వంగా చెప్పుకునేవాడు. ఈ గమలియేలు ఆ రోజులలో గొప్ప రబ్బీ అయివున్నాడు. పౌలు, తిరిగి జన్మించక పూర్వం యేసుక్రీస్తు నందు విశ్వాసముంచిన వారిని బంధించటానికి వెళ్ళుతున్నాడు. అయితే దమస్కు మార్గములో ప్రభువైన యేసుక్రీస్తును యెరిగి ఆ విశ్వాసములో కొనసాగాడు. నీరు మరియు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును పొందుకుని తిరిగి జన్మించిన అనుభవముతో దేవుని దృష్టిలో నీతిమంతుడు కాగలిగాడు.మనము దేవుని చిత్తమును ఎరిగి దానిని చేయవలయును.


 • మనము యేసునందు విశ్వాసము
 • ఉంచుటకు ఏమి చేయవలయును?
 • మొదటిగా మనమాయన చిత్తమును
 • తెలిసికొనవలయును.


మనము శుద్ధీకరించబడాలన్నదే దేవుని చిత్తము. ‘‘మీరు పరిశుద్ధులగుటయే. అనగా మీరు జారత్వమునకు దూరముగా వుండుటయే దేవుని చిత్తము’’ (1థెస్స 4:3) మనము సంపూర్ణముగా పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము అని గ్రహించాలి. అందుకే మనమీ నీరు మరియు ఆత్మ ద్వారా పరిశుద్ధలము కాగలము. ఆ తరువాత మన జీవితాంతము విశ్వాసములో కొనసాగగలము.

ఒకవేళ ఎవరైనా యేసునందు విశ్వాసముంచి, ఇంకనూ తమ హృదయములలో పాపముకలిగి నివసించినయెడల ఆ వ్యక్తి దేవుని చిత్తానుసారము జీవించుట లేదని గ్రహించాలి. ఆయన చిత్తమును అనుసరించుట అనగా మనము యేసునందు లభించిన రక్షణ ద్వారా పరిశుద్ధపరచబడాలి. ఇదే దేవుని చిత్తమని గ్రహించగలగాలి. 

‘‘యేసునందు విశ్వసించిననూ ఇంకనూ నీ హృదయములో పాపము నిలచియున్నదా?’’ అని నేను మిమ్మును అడిగినప్పుడు మీ సమాధానము ` అవును అయితే ఇప్పుడు మీరు దేవుని చిత్తమును ఎరుగలేదని అర్థము. మనము ఈ నీరు మరియు ఆత్మయందు వుంచిన విశ్వాసము ద్వారా మన పాపముల నుండి రక్షింపబడి శుద్ధీకరణ పొందుటయే దేవుని చిత్తమై యున్నదని గ్రహించాలి.

ఒకప్పుడు ఒక తండ్రి నివసించేవాడు. అతనికి విధేయులైన కుమారులున్నారు. తనకు ఎక్కువగా విధేయుడైన పెద్దకుమారుని పిలచి ‘‘కుమారుడా నీవు పొలములో వున్న మన ద్రాక్షతోటకు పోయి...’’ అని చెప్పుచున్నాడు.

ఆయన మాటలు ముగించకముందే ఈ పెద్దకుమారుడు సరే, తండ్రీ అని చెప్పి వెళ్ళిపోయాడు. తన తండ్రి ఏమి తెలియజేస్తున్నాడో తెలుసుకోకుండానే అతడు వెళ్ళాడు.

వెంటనే తండ్రి అతనిని కేకవేసి, కుమారుడా నీ విధేయత ఎంతో మెచ్చుకోదగినది అయితే అక్కడకు వెళ్ళి నీవు ఏమి చేయాలని నేను కోరుతున్నానో అది నీవు తెలుసుకోవాలి.

‘‘సరే తండ్రీ నేను నీవు చెప్పిందల్లా చేస్తాను. నా కంటే నీకు విధేయులెవరు?’’

అని చెప్పి వెళ్ళిపోయి కొంతసేపు తరువాత తిరిగి ఖాళీచేతులతో వచ్చాడు. తన తండ్రి అక్కడకు వెళ్ళి తానేమి చేయగోరుచున్నాడో తెలిసికొనకుండానే వెళ్ళివచ్చాడు. అతను కేవలము గుడ్డిగా తండ్రికి విధేయుడయ్యాడు.

యేసుక్రీస్తు గురించిన సత్యమును సంపూర్ణముగా మనకు తెలియకుంటే మనము కూడా ఈ విధమైన వారమే అవుతాము. అనేకమంది భక్తులు గుడ్డిగా వేదాంత సిద్ధాంతాలను నమ్ముతారు. దశమ భాగాలని సక్రమంగా చెల్లిస్తారు. అనేక రాత్రులు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేస్తారు. ఉపవాసాలు మొదలగునవన్నియు కూడా నెరవేరుస్తారు. అయితే దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా కేవలము ఆచారాలను పాటిస్తారు.

వారు హృదయములో పాపము కలిగి చనిపోయినప్పుడు పరలోకద్వారములు వారికొరకు మూసివేయబడతాయి. దేవుడు వారి నుండి ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకోకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు.

‘‘ఆ దినమందు అనేకులు నన్ను చూచి ` ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారాలా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును.’’ (మత్తయి 7:22-23)


 • అక్రమము చేయుట అనగా నేమి?
 • ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను 
 • గ్రహించక యేసునందు విశ్వాసముంచినను 
 • ఇంకనూ పాపిగా ఉండుటయే.


దేవుడు, ఆయన యందు మనము విశ్వాసముంచాలని, అలాగే ఆయన చెప్పిన పనులు చేయాలని మననుంచి ఆశిస్తున్నాడు. ప్రభువైన యేసు మన సమస్త పాపమును ఆయనపై మోపుకున్నాడని మనము విశ్వసించాలి. అనేకులు ప్రవచిస్తారు. దయ్యములను వెడలగొడతారు. ఆయన నామములో అద్భుత కార్యాలను చేస్తారు. అయితే ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సత్యమును సరిగా గ్రహించరు.

అద్భుత కార్యాలంటే వారి దృష్టిలో అనేక సంఘభవనాలను నిర్మించటం, సంఘ ఆర్థిక అవసరాల నిమిత్తం విశ్వాసుల ఆస్తులను అమ్మించటం, దేవుని కొరకు అనేకమంది విశ్వాసులు ప్రాణములను అర్పించటం మొదలగునవి కూడా వారి దృష్టిలో వుంటాయి.

ప్రవచించటం అంటే వారి దృష్టిలో తానొక గొప్పనాయకుడుగా చెలామణి అవ్వటం. ఇటువంటి వ్యక్తులు పరిసయ్యులవలె తాము ధర్మశాస్త్రమును అనుసరించి జీవిస్తున్నామని గర్వంగా ప్రజలకు తెలియజేస్తూ ప్రభువైన యేసుకు కోపము తెచ్చిపెట్టగలరు. అనేకమంది పారంపర్య క్రైస్తవులు కూడా ఈ విధంగా ఆలోచిస్తుంటారు. 

దయ్యములను వెళ్ళగొట్టుట అంటే శక్తిని ప్రదర్శించటం. వారి విశ్వాసముతో ఈ విధముగా చేయటానికి ఎంతో ఉత్సాహపడుతుంటారు. అయితే అంతములో ప్రభువు వారిని నేను ఎరుగను అని చెప్పగలడు. నేను మిమ్మును ఎరుగకుంటే మీరు నన్ను గురించి ఏవిధముగా తెలుపగలరు? అని ప్రశ్నిస్తాడు. 

‘‘అప్పుడు ` నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును.’’ (మత్తయి 7:23) ఆ దినమున అనేకమంది వ్యక్తులు తమ గుండెలు బాదుకుంటారు. ‘‘ప్రభువా, నేను మిమ్మును విశ్వసించాను. మీరు నా రక్షకుడని నేను నమ్మియున్నాను.’’ అవి వాపోతారు. వారు ప్రభువుని ప్రేమించామని అనుకుంటారు కాని, వారి హృదయములలో ఇంకనూ పాపము నిలచియే యున్నదని గ్రహించరు. ప్రభువు వారిని అక్రమము చేయువారలారా అని పిలుచుచున్నాడు. అనగా వారింకనూ విమోచింపబడనివారు అని అర్థము. ఆ విధముగా పిలచి వారిని తన నుండి తొలగిపొమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు.

ఆ దినమున తిరిగి జన్మించిన అనుభవము లేకుండా వారు యేసు సన్నిధిలో రోదిస్తారు. ‘‘నేను గొప్పగా ప్రవచించాను. అనేక సంఘాలను నిర్మించాను. మీ నామములో 50మంది పైగా సేవకులను ఈ లోకములోనికి పంపిచాను.’’ అని విన్నవించుకుంటారు.

అయితే ఇంకనూ హృదయములలో పాపము నిలచియున్న వీరితో ప్రభువు స్పష్టముగా తెలియపరుస్తాడు. ‘‘నేను మిమ్మును ఎరుగనే ఎరుగను; అక్రమము చేయువారలారా నా నుండి తొలగిపొండి.’’

‘‘ప్రభువా మీరేమంటున్నారు? నేను మీ నామమున ప్రవచించలేదా? నేను సంఘములో అనేక సంవత్సరాలు సేవ చేసాను గదా.... అనేకులు మీయందు విశ్వసించేలా నేను బోధించాను. మీరిప్పుడు నేనెవరో ఎరుగనంటారేమిటి?’’ అని ప్రశ్నిస్తారు.

అప్పుడాయన ‘‘నేను మిమ్మును ఎరుగనే ఎరుగను. మీరు నన్ను ఎరిగియున్నామని చెప్పినప్పటికీ మీ హృదయములలో ఇంకనూ పాపము కలిగియున్నారు గనుక మీరు నా నుండి తొలగిపోండి.’’ అని సమాధానమిస్తాడు.

దేవుని యందు విశ్వాసముంచిననూ హృదయములలో ఏ మాత్రము పాపము కలిగియున్ననూ లేక ఆయన రక్షణ జ్ఞానము లోపించిననూ అది దేవుని యెదుట అక్రమమైయున్నది. దేవుని చిత్తము గ్రహించక వుండుట కూడా అక్రమమే. ఆయన చిత్తము గ్రహించకుండా లేక ఈ నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించే ఆశీర్వాదము గురించి తెలియకుండుట కూడా అక్రమమే. ఆయన చిత్తము సంపూర్ణముగా గ్రహించకుండా ఆయనను అనుసరించుట అక్రమమే. అక్రమము ఒక పాపము.బైబిలులో తెలియపరచిన దేవుని చిత్తము.


 • దేవుని పిల్లలుగా ఎవరు కాగలరు?
 • హృదయములో పాపము లేని నీతిమంతులే.


ఈ నీరు మరియు ఆత్మ వలననైన సువార్త యందు మనము విశ్వసించాలన్నదే ఆయన చిత్తమైయున్నది. నిజమైన సువార్త మనలను తిరిగి జన్మింపచేస్తుంది. ఆయన పిల్లలుగా మనము సువార్త నిమిత్తమై జీవించాలన్నదే దేవుని చిత్తము. అనేకులు ఈ నీరు మరియు ఆత్మ వలన తిరిగి జన్మించే సువార్తను గ్రహించలేరు. కనుక ఈ విషయముగా ఆయన చిత్తము తెలిసికోవాలనే దేవుని అభిమతం.

నేను అనేకమందిని మీరు ఎందువలన యేసును విశ్వసిస్తున్నారని అడిగాను. మేము పాపము నుండి రక్షింపబడాలని యేసునందు విశ్వసిస్తున్నామని అనేకులు తెలిపారు.

‘‘అయితే మీ హృదయములలో పాపము నిలచియున్నదా?’’ అని నేను అడిగాను.

‘‘అవును, నిలచియున్నది.’’ అని వారు తెలిపారు.

‘‘అయితే మీరు రక్షింపబడ్డారా, లేదా?’’

‘‘అవును, మేము రక్షింపబడ్డాము.’’ అని వారన్నారు.

‘‘తన హృదయములో ఇంకనూ పాపము కలిగియున్న వ్యక్తి పాపిగదా! అయితే ఆ వ్యక్తి ఎటుల రక్షింపబడగలడు మరియు దేవుని రాజ్యములో ఎటుల ప్రవేశింపగలడు?’’

‘‘అవును, ప్రవేశించలేడు.’’

‘‘అటులైతే నీవు దేవుని రాజ్యములోనికి ప్రవేశించగలవా? లేక నరకాగ్నిలోనికి వెళతావా?’’

అనేకులు మేము పరలోకములోనికి ప్రవేశిస్తామని తెలిపారు. వారు వెళ్ళగలరా? లేదు, వారి గమ్యము నరకమే.

అనేకులు కేవలము యేసునందు విశ్వాసముంచుట వలన పరలోకములో ప్రవేశించగలమని భావిస్తున్నారు. వారు హృదయములో ఇంకనూ పాపము నిలుపుకొని, వారి యెడల దేవుని చిత్తమేదో గ్రహించక, దాని ప్రకారము జీవించక, పరలోకరాజ్యములో ప్రవేశించగలమని భావిస్తున్నారు. అయితే దేవుడు పరలోకరాజ్యములోనికి వారిని చేర్చుకొనడు.

దేవుని చిత్తము ఏమైయున్నది? బైబిలు ప్రకారము ఆయన కుమారుడైన యేసుక్రీస్తుయందు విశ్వాసము ఉంచుట, యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువరక్తము ద్వారా లభించే విమోచనా ఆశీర్వాదమునందు విశ్వాసముంచుట దేవుని చిత్తము అని తెలియజేయుచున్నది.

నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించే ఆశీర్వాదమునందు విశ్వసించినవారే దేవుని పిల్లలు కాగలరు. ఆయన పిల్లలగుటయే మనకు మహిమ. ఆయన పిల్లలు నీతిమంతులు.

దేవుడు మనలను నీతిమంతులుగా పిలుస్తున్నాడు. క్రైస్తవుడై ఇంకనూ పాపిగా ఉంటే ఆయన మనలను నీతిమంతులని ఏ విధముగా పిలువగలడు? దేవుడు అబద్దీకుడు కాడు. ఆయనయెదుట మనము పాపులుగానో లేక నీతిమంతులుగానో మాత్రమే ఉండగలము. ‘పాపము లేనివారిలాగా’ ఈ విధముగా ద్వంద్వ స్వభావాలతో వుండటమన్నది ఆయన దృష్టిలో జరుగనే జరగదు. ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త నందు విశ్వసించువారిని ఆయన పరిశుద్ధపరచును.


 • మనమేలాగు దేవుని పిల్లలము
 •  కాగలము?
 • ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను
 • అంగీకరించుట ద్వారా


దేవుడు లోకపాపమంతయు తన కుమారునిపై మోపెను. ఆయన అద్వితీయ కుమారుడు కూడా సిలువపై తీర్పుపొందవలసి వచ్చెను. దేవుడు అబద్దీకుడు కాడు. ‘‘పాపమునకు జీతము మరణము.’’ (రోమా 6:23) అని దేవుడు తెలియజేసెను. ఆయన సొంతకుమారుడు సిలువపై మరణించినప్పుడు ఈ భూమిపై దాదాపు 3 గంటలు చీకటి కమ్మెను.

‘‘ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ` ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడచితివని అర్థము.’’ (మత్తయి 27:46)

యేసు, తాను పొందిన బాప్తిస్మము ద్వారా లోకపాపమునంతయు తొలగించి ప్రజలను వారి పాపము నుండి విమోచించెను. సకల మానవాళి పాపములను ఆయన తలపై మోపుకొని దానిని బట్టి సిలువ వేయబడి తన తండ్రిచేత చేయి విడువబడెను. దేవుడు యొర్దానులో యేసు స్వీకరించిన పాపమును బట్టి తన సొంత కుమారుడైన యేసునే సిలువపై తీర్పునకు గురిచేసెను. 3 గంటలు ఆయన తన కుమారునికి తన ముఖమును చాటు చేసెను.

‘‘తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.’’ (యోహాను 1:12)

మనము దేవుని పిల్లలమా? ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను అంగీకరించి మనము తిరిగి జన్మించిన అనుభవము గలవారమైతిమి. ఈ నీరు మరియు ఆత్మసంబంధమైన సువార్త ద్వారా తిరిగి జన్మించి మనము నీతిమంతులమైతిమి. దాని ద్వారా మనమందరము నీతిమంతులమైతిమి. 

‘‘దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధియెవడు.’’ (రోమా 8:31). ఒక నీతిమంతుడైన వ్యక్తి దేవుని యెదుట మరియు ప్రజల యెదుట తాను నీతిమంతుడుగా తీర్పుపొందితినని చెప్పగా, విమోచింపబడని వ్యక్తులు అతనికి తీర్పుతీర్చటానికి ప్రయత్నిస్తారు. ఇందు నిమిత్తమై అపోస్తలుడైన పౌలు ఈ విధముగా తెలియజేశాడు. ‘‘దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్పువాడు దేవుడే.’’ (రోమా 8:33) దేవుడు మన పాపములను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తుడిచివేసి మనలను పరిశుద్ధపరచి, నీతిమంతులుగా మార్చి ఆయన పిల్లలుగా పిలిచియున్నాడు. మనము మహిమగల దేవుని పిల్లలగుటకు హక్కు అనుగ్రహింపబడినది.

నీరు మరియు ఆత్మ ద్వారా జన్మించిన వారందరూ ఆయన పిల్లలే. వారు ఆయనతో నిత్యత్వములో నివశిస్తారు. వారు కేవలము ఈ లోకములో జీవిస్తున్న శరీరధారులు కాదు గాని, పరలోకమునకు చెందిన దేవుని పిల్లలు. 

ఇప్పుడు వారు దేవుని నీతియుక్తమైన పిల్లలు. వారికి విరోధముగా ఎవరూ వారి మీద నేరము మోపలేరు. మరియు తీర్పుతీర్చి దేవుని నుండి దూరపరచలేరు. 

యేసునందు విశ్వసించుటకు మనమీ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను గ్రహించాలి. మనకు బైబిల్‌ తెలిసియుండాలి. అన్నిటికంటే ముఖ్యముగా మనము దేవుని చిత్తమును గ్రహించగలగాలి. అంతేకాక దేవుని చిత్తప్రకారము జీవించగలగాలి.పాపులు ఈ నీరు మరియు ఆత్మసంబంధమైన సువార్త ద్వారా తిరిగి జన్మించాలన్నదే దేవుని చిత్తము.


 • పాపియైన మానవుని స్వరూపములో
 • తన కుమారుని దేవుడు ఎందువలన
 • పంపవలసివచ్చెను?
 • మానవుల పాపములను ఆయన తన కుమారునిపైన
 • మోపవలసివచ్చెను గనుక.


మనము విమోచింపబడి నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మింపబడాలన్నదే దేవుని చిత్తము. ‘‘మీరు పరిశుద్ధులగుటయే, దేవుని చిత్తము.’’ (1థెస్స 4:3)

మనము రక్షింపబడుటకు తన కుమారుని ఈ లోకమునకు పంపి మనందరి పాపములు ఆయనపైన మోపుటయే దేవుని చిత్తము. ఆత్మనియమము ద్వారా ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన, తిరిగి జన్మించు అనుభవము మనము పొందవలయును. ఆ ఆత్మ నియమమే మనలను పాపము నుండి విడిపించినది. 

మనమిప్పుడు విమోచింపబడ్డాము. ఇప్పుడైనా మీరందరూ దేవుని చిత్తమును సరిగా గ్రహించరా? మనలనందరినీ విమోచించాలన్నదే దేవుని చిత్తము. మనము ఈ లోకముతో జోడుగా వుండక ఆయన మాటయందు విశ్వాసముంచి ఆయననే ఆరాధించాలన్నది దేవుని అభిమతం.

విమోచింపబడి తిరిగి జన్మించిన అనుభవము ఈ విధముగా పొందుకొనినవారు ఈ సువార్తను సంఘములో సాక్ష్యమిస్తూ, అనేక ఆత్మలను తిరిగి దేవుని యొద్దకు చేర్చే పనిలో నిమగ్నమై వుండాలన్నదే ఆయన చిత్తము.

మనము పాపము చేయాలని అనుకొనము గాని మన జీవితములో పాపములు అరికట్టలేని బలహీనులము గనుకనే పాపము చేయుచున్నాము. అయితే ప్రభువైన యేసు మన పాపములను తొలగించియున్నాడు. దేవుడు ఈ లోకపాపమంతయు స్థానికుడైన యోహాను ద్వారా తన కుమారుడైన యేసుపై మోపెను. దేవుడు తన సొంతకుమారుని ఈ లోకమునకు పంపి, స్థానికుడైన యోహాను చేత ఆయనకు బాప్తిస్మమిప్పించుట దేవుని రక్షణ ప్రణాళికలోని భాగము. మనము ఈ విశ్వాసము ద్వారా రక్షింపబడితిమి. ఇదే మనయెడల దేవుని చిత్తము.ఆయన పంపిన యేసునందు మనము విశ్వసించాలన్నదే దేవుని చిత్తము.


 • పాపియైన మానవుని స్వరూపములో
 • ప్రభువైన యేసు ఎందుకు వచ్చెను?
 • సకల మానవుల పాపములను స్వీకరించుటకు


తాను పంపిన వానియందు విశ్వాసముంచుటే మనయెడల దేవుని చిత్తమని బైబిల్‌ తెలియజేస్తున్నది. ‘‘వారు ` మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా యేసు ` ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను. వారు ` అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి.’’ (యోహాను 6:28-31).

ప్రజలు యేసుతో ఈ విధముగా చెప్పిరి. కనాను ప్రయాణములో దేవుడు మోషేకు ఒక సూచనను ఇచ్చెను. అదే పరలోకమునుండి ఇశ్రాయేలీయులకు లభించిన మన్నా. అందు నిమిత్తమే వారు దేవుని యందు విశ్వసించిరి. (యోహాను 6:32-39). ప్రజలు యేసును ఈ విధముగా అడిగిరి. ‘‘మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెను.’’

దేవుని క్రియలు చేయుటకు వారు తనయందు విశ్వాసముంచవలెనని యేసు చెప్పెను. మనమునూ దేవుని పని చేయవలనన్నచో ముందుగా యేసు చేసిన క్రియయందు విశ్వసించవలెను. మనము కేవలము విశ్వాసముంచి బోధించుటకే కాక వాటి ప్రకారము జీవించవలెనన్నదే మన యెడల దేవుని చిత్తము.

దేవుడు మనకు ఈ విధముగా ఆజ్ఞ ఇచ్చెను. ‘‘కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.’’ (మత్తయి 28:19-20)

తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున బాప్తిస్మమియ్యవలెనని యేసు వారికి స్పష్టముగా బోధించెను. తన తండ్రి నిమిత్తము మరియు పరిశుద్ధాత్మ నిమిత్తము యేసు చేసిన దంతయు ఆయన పొందిన బాప్తిస్మములో ఇమిడియున్నది. మనము ఈ సత్యమును అర్థము చేసికొనిన యెడల మనము దేవునియందు సంపూర్ణముగా విశ్వసించి ఆయన ఈ లోకములో చేసినదంతయు తెలుసుకొందుము. మరియు ఆత్మ విషయములో ఇచ్చిన సాక్ష్యము కూడా తెలిసికొందుము.

యేసు ఈ లోకములో ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తకు సాక్షిగా తండ్రిచేత పంపబడెను. కనుక దేవుని మరియు ఆయన సేవకుని వాక్యమునందు విశ్వాసముంచిన యెడల మనము రక్షింపబడగలము.దేవుని యొక్క పనిచేయుట.


 • మన జీవితముల యొక్క
 • ఉద్దేశ్యమేమైయున్నది?
 • సత్యసువార్తను లోకమంతటా ప్రకటించుటే
 • దేవుని చిత్తమును నెరవేర్చుట.


దేవుని పని చేయవలెనంటే మనము ముందుగా యేసుపొందిన ఈ బాప్తిస్మమును, అటులనే సిలువ మరణమునకు సంబంధించిన సువార్తయందు విశ్వాస ముంచవలయును. దేవుడు పంపిన యేసునందు విశ్వాసముంచుటే దేవుని పనిచేయుట, యేసునందు విశ్వాసముంచుటకు మనము మొట్టమొదటిగా ఆయన యందు విశ్వసించి నీరు మరియు ఆత్మద్వారా రక్షింపబడవలయును.

మనము ఈ విధముగా యేసునందు విశ్వసించి, ఈ సువార్తను బోధించినట్లయితే దేవుని చిత్తమును మన జీవితములో నెరవేర్చగలము. ఈ విధముగా మనము దేవుని పని చేయగలము. నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన వారే పరలోకరాజ్యములోనికి ప్రవేశించగలరని ప్రభువైన యేసు సెలవిచ్చెను.

మనమందరము ఈ క్రింద ఉదాహరింపబడిన సత్యమును పాటించి పరలోకరాజ్యములోనికి అడుగిడగలము. యేసుపొందిన బాప్తిస్మము ద్వారా లోకపాపములన్నియు ఆయనపై మోపబడినవను సత్యమునందు విశ్వాసముంచి దేవుని యొక్క చిత్తమును తెలిసికొనవలయును. దేవుని రాజ్య విస్తరణలో పాటుపడవలయును. చివరిగా మనము చనిపోవు పర్యంతము ఈ సువార్తను చాటవలయును.

నా సహక్రైస్తవులారా, ఈ నీరు మరియు ఆత్మ సంబంధిత సువార్తను విశ్వసించినవారు దేవుని పని చేయగలరు. దేవుని పనిచేయుట అనగా ఆయన పంపినవానియందు విశ్వాసముంచుటయే. మనకు రక్షకునిగా పంపబడిన యేసుక్రీస్తుపై ఈ లోకపాపమంతయు మోపబడెనని విశ్వసించుటే దేవుని చిత్తమును గ్రహించుటైయున్నది.

ప్రభువైన యేసు యొర్దానులో బాప్తిస్మముపొంది, సిలువపైన మరణించుట ద్వారా మానవుల విమోచనాకార్యము సంపూర్ణమాయెను. రెండవదిగా దేవుడు పంపినవానియందు విశ్వాసముంచి ఆయన పనులను నెరవేర్చవలయును, అనగా రక్షకుడు ఈ లోకపాపమంతయు స్వీకరించెనని గ్రహించి ఈ సువార్తను లోకమంతట ప్రకటించవలయును.ఇప్పుడు తిరిగి జన్మించిన మనము ఈ సువార్తను లోకమంతట ప్రకటించవలయును.


 • యేసునందు విశ్వాసముంచిననూ
 • దేవుని చిత్తమును యెరుగని వారి
 • గమ్యము ఏమైయున్నది?
 • వారు నరకమునకు పోవుదురు.


‘‘ఆ దినమందు అనేకులు నన్ను చూచి ` ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు ` నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును.’’ (మత్తయి 7:22-23)

ఈ పై వాక్యభాగమువలన దేవునియెదుట ఎవరు పాపియో మరియు ఎవరు అక్రమము చేయుచున్నారో తెలియవచ్చుచున్నది.

‘ప్రభువా, ప్రభువా అని పిలుచువారిలో అనేకులకు తిరిగి జన్మించిన అనుభవము లేదు. వారి హృదయములో వుంచబడిన పాపమును బట్టి వారు ఎప్పుడూ బాధింపబడుదురు. అందుకనే వారు ‘ప్రభువా, ప్రభువా’ అని ఎలుగెత్తి పిలిచెదరు. వారి హృదయరోదన ఆరాధన మరియు ప్రార్థన తగిన రీతిలో వుండదు.

వారు ప్రార్థనలో ఎలుగెత్తి అరచినట్లయితే తమ మనస్సాక్షి నిర్మలమగునని భావిస్తారు. అయితే ఇంకనూ పాపము వారి హృదయములలో నిలచియున్నది గనుక ఇది అసంభవము. వారు పర్వతముకు వెళ్ళి ప్రార్థన చేసినను హృదయ రోదనతో అరచిననూ దేవుడు వారికి దూరముగానే వుండును. మన హృదయములలో సంపూర్ణమైన విశ్వాసము లేని సమయమున మనమెక్కువగా ‘ప్రభువా, ప్రభువా’ అని ఎలుగెత్తి అనేకసార్లు పిలిచెదము.

అనేక సంఘాలలో తిరిగి జన్మించిన అనుభవము లేని సంఘస్థులు ఎంతో ఉత్సాహముతో ప్రార్థనావేదిక బద్ధలగునంత శబ్దముతో ఎలుగెత్తి ప్రార్థించెదరు. 

అయితే మనము బైబిలులో చూచిన ప్రకారము ‘ప్రభువా, ప్రభువా’ అని పిలుచువారు అందరూ దేవుని రాజ్యములో ప్రవేశింపలేరు. ఎవరైతే ఈ నీరు మరియు ఆత్మసంబంధమైన సువార్తయందు విశ్వసించి, ఆ విశ్వాసముతో దేవుని యొక్క పని చేయుదురో వారే పరలోకములో ప్రవేశించగలరు.

హృదయములో పాపముకలిగి దేవుని నామము పిలిచిననూ అది అక్రమమేయని బైబిలు తెలుపుచున్నది. మీరెప్పుడైనా ప్రార్థనాకొండకు వెళ్ళి సభలో పాల్గొన్నారా? అక్కడ అనేకమంది సంఘపెద్దలైన వృద్ధ సహోదరీలు దేవా, దేవా అని ఎలుగెత్తి పిలుచుచుండుట మనము చూడగలము. ఎందువలనంటే వారు ప్రభువైన యేసులోని సత్యమును కనుగొనలేదు, మరియు వారి హృదయములో ఆత్మను కలిగియుండలేదు. అంతేకాక వారు నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించలేదు. వారి హృదయము ఎప్పుడూ కూడా తాము నరమునకు వెళ్ళె దమేమోనన్న భయముతో నిండివుండి ఎంతో ఆతురతతో ఆయనను పిలుచుచుందురు.

ఒక సంఘకాపరిగానీ, లేక దేవసేవకు అంకితమైన ఒక మిషనరీగాని, చివరకు దేవుని చేత విడిచిపెట్టబడినాడని భావిద్దాం. తల్లిదండ్రులు వలన విడిచి పెట్టబడితే లేక ఒక భార్య భర్తనో మరియు ఒక భర్త భార్యనో విడనాడితేనే అది వారి హృదయమును పగులగొట్టును. అయితే దేవుని చేతనే మనము విడిచిపెట్టబడినయెడల మన స్థితి ఏమగును? రాజులకురాజు మన ఆత్మకు న్యాయాధిపతి మనలను వదిలివేసినట్లయితే మనమెక్కడకు పోగలము?

ఈ విధముగా మీలో ఎవరికి జరుగరాదని నా ఆకాంక్ష. దయచేసి ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను విని, గ్రహించి విశ్వసించమని వేడుకుంటున్నాను. ఈ నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను విని, విశ్వసించి తిరిగి జన్మించి, ఆ విశ్వాసములో జీవించుటే దేవుని చిత్తమని మీకు విన్నవించుకుంటున్నాను.

క్రైస్తవులమైన మనము ఈ నీరు మరియు ఆత్మ సంబంధిత సువార్తయందు నిజముగా విశ్వాసముంచి, బైబిలులోని ఈ సత్యము గ్రహించుట ద్వారా బలపడగలము. అప్పుడే దేవుని న్యాయపు తీర్పునుండి మనము రక్షించబడగలము.