Sermons

[11-5] < ఆదికాండము 15:1-21 > ప్రత్యక్షపు గుడారంలో అర్పణలను అర్పించడానికి ఇశ్రాయేలీయులు ఎలా వచ్చారు : చార
< ఆదికాండము 15:1-21 >

“ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి - అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము - ప్రభువైన యెహోవా నాకేయిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనైపోవుచున్నానే, దమస్కు ఎలీయెజెరే నా యింటి ఆస్తికర్తయగును గదా. మరియు అబ్రాము - ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు. గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడుకాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకువారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీచేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను. ఆయన అది అతనికి నీతిగా యెంచెను. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, అతడు ప్రభువైన యెహోవా నేను దీని స్వతంత్రించుకొందునని నాకెట్లు తెలియుననగాఆయన మూడేండ్ల పెయ్యను, మూడేండ్ల మేకను, మూడేండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నాయొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరములవిూద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దు గ్రుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్రపట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వంద ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు. గనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.

మరియు ప్రొద్దుగ్రుంకి కటిక చీకటిపడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండములమధ్య నడచిపోయెను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్పనదియైన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా కేనీయులను, కనిజ్జీయులను, కాద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యోబూసీయులను, నీ సంతానమునకిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.’’దేవుని వాక్యములో అబ్రాహాము విశ్వాసము


బైబిలులో వివరించిన అబ్రాహాము విశ్వాసమంటే నాకెంతో గౌరవము, ఎంతో ఆశ్చర్యం. అబ్రాహాము విశ్వాసమును చూసినప్పుడు ఆ విశ్వాసంలో ఎన్ని కష్టాలు వచ్చినా అతడు యెహోవా మాటను అనుసరించాడు. అందుకని మనం ఆయనను గౌరవించక, ఆశ్చర్యపడక వుండలేం. ఆది 12:3లో చెప్పినట్లు దేవుడు అబ్రాహామునెంతో దీవించాడు. అతనితో ‘‘నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును” అని ఆయనతో చెప్పాడు. ఈ గొప్ప ఆశీర్వచనం ఆది 15:1లో కూడా చెప్పాడు. ‘‘నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును” అని దేవుడు ప్రకటించాడు. అబ్రాహాముకు ఆయన తన సొంత దేవుడు అయ్యేంత ప్రత్యేకమైన ప్రేమ అబ్రాహాము పట్ల ఆయనకున్నది.

కల్దీ యుల దేశంలోని ఊర అను గ్రామం నుండి నడిపించిన తర్వాత దేవుడు అబ్రాహాముతో ‘‘నేను నీకు కేడెము. నీ బహుమానము అత్యధికమగును” అని చెప్పాడు. దేవుడీ మాట చెప్పగా ‘‘నీవు నాకేమిస్తావు” అని అ బ్రాహాము అడిగాడు. ఇలా అడగడంలో సందేహించే హృదయంతో, అపనమ్మకంతో కాదు గాని, దేవునిచేత దీవెనలు పొందాలన్న హృదయపూర్వకమైన కోర్కెలను ఆ మాటలు వ్యక్తం చేస్తున్నాయి. అయినా దేవుని నుండి అబ్రాహాము కోరినదేదో ఆయన మాటలు తెలియజేస్తున్నాయి. ‘‘నీవు నాకేమిస్తావు? నేను సంతానం లేని వాడను. నా సేవకుడు దమస్కువాడైన ఎలీయాజరు నా దత్త పుత్రుడైతే నా ఆస్తికి వారసుడెవరు? కనుక నీవు నాకేమిస్తావు?’’ అని అడిగాడు. ఈ మాటల్లో తన సొంత కుమారుని కోసం ఎంత మనఃపూర్వకంగా అడిగాడో తెలుస్తోంది. పిల్లలు వద్దు అనుకొనే వారు అబ్రాహాము కోర్కెను బలపరచలేరు గాని తనకు వారసునిగా సొంత కుమారుని కోసం దేవుని మనసార వేడుకొన్నాడు.

తన స్వరూపంలో చేయబడిన తన పిల్లలకు దేవుడు తన దీవెనలు యిచ్చినట్టే మనం కూడా మన స్వంత పిల్లలకు మంచి వాటిని యివ్వాలని మనఃపూర్వకంగా కోరుకుంటాం. అందుకని ‘‘నా సేవకుడు నా వారసుడవుతాడు గదా” అని అబ్రాహాము చెప్పడంలో తన స్వంతకుమారుని తనకు వారసునిగా పొంది ఎంతగా దీవెనలు పొందాలని అబ్రాహాము ఆశించాడో మనం అర్థం చేసుకోగలం. అప్పుడు దేవుడు ‘‘నీ సేవకుడు దమస్కువాడైన ఏలియాజరు, నీ వారసుడు కాడు. నీ గర్భవాసమున నీ భార్యకు పుట్టిన వాడే నీ వారసుడవుతాడు” అని దేవుడు జవాబు చెప్పాడు.

ఆ తర్వాత దేవుడు అబ్రాహామునకు బయటికి తీసుకొని వచ్చి ఆకాశము వైపు చూచి, నీచేతనైతే ఆకాశ నక్షత్రాలను లెక్కించమని చెప్పాడు. అబ్రాహాము ఆకాశంలోనికి చూశాడు. లెక్కించలేనన్ని నక్షత్రాలు, అందమైన పాలపుంతలు, పూలసరాల్లా వేలాడుతూ ఉన్నాయి. నీ చేతనైతే వాటిని లెక్కించు అని దేవుడు చెప్పినప్పుడు లెక్కించ మీలేనన్ని నక్షత్రాలున్నాయి ప్రభువా అని చెప్పాడు అబ్రాహాము. అప్పుడు దేవుడు ఆ ఆకాశ నక్షత్రాల్లా లెక్కించ వీలులేనంత సంతానాన్ని నీకనుగ్రహిస్తానని అబ్రాహాముతో వాగ్ధానం చేశాడు.

అబ్రాహాము దేవుడు చేసిన ఈ వాగ్ధానాన్ని నమ్మాడు. అలా దేవుడు చెప్పిన ప్రతి మాటను నమ్మిన అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అయినాడు. అప్పుడు దేవుడు ‘‘నీ విశ్వాసం నిజమైనది. నీవు నా మాట నమ్మావు గనుక ఆకాశ నక్షత్రాలవలె నీకు సంతానాన్ని యిస్తాను” అని దేవుడు చెప్పాడు.అబ్రాహాము బలియర్పణ, కనాను దేశాన్ని యిస్తానన్న దేవుని వాగ్ధానం.


దేవుడు అబ్రాహామును కల్దీయుల దేశం నుండి బయటికి తీసుకొని వచ్చి, అతనికి అతని సంతానానికి కనాను దేశాన్ని యిస్తానని వాగ్ధానం చేశాడు. అందుకు ఋజువు దేవుడు అబ్రాహాముకు చెప్పిన మాటల్లోనే వుంది. ‘‘మూడేండ్ల పెయ్యను, మూడేండ్ల మేకను, మూడేండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావరపు పిల్ల నా యొద్దకు తెమ్మని చెప్పాడు. నీకు నీ సంతానానికి కనాను దేశాన్ని యిస్తాననడానికి యిదే నా నిబంధన సాక్ష్యం” అని చెప్పాడు. దీనిని బట్టి అబ్రాహాము సంతానం తమ పాపాల నుండి కడుగబడడానికి దేవుని బలియర్పణలు అర్పించాలి. అప్పుడు ఈ విశ్వాసంతో వారు కనాను దేశంలో ప్రవేశిస్తారన్నది వాగ్ధానం.

అబ్రాహాము ఈ బలి అర్పిస్తూ గాఢనిద్రా పరవశుడైనాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ‘‘నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు. మంచి వృద్దాప్య మందు పాతి పెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరల వచ్చెదరు” అని దేవుడు వాగ్ధానం చేశాడు. (ఆది 15:13-16)

మరోమాటలో చెప్పుకొంటే, ఐగుప్తులో (ఈజిప్టులో) దేవుడు ఇశ్రాయేలీయులు అభివృద్ధి పొందునట్లు చేసి ఆ తర్వాత వారిని కనాను దేశానికి నడిపిస్తానని వాగ్దానం చేశాడు. దానిని చేయడానికి వారి పాపాలను తుడిచి వేయడానికి వారు ప్రత్యక్ష గుడారంలో బలియర్పణలు యివ్వాలని నిర్ణయించాడు. తానీ వాగ్ధానాన్ని నెరవేరుస్తానని అబ్రాహాముకు తెలియజేయడానికి ఒక అగ్నిజ్వాల అబ్రాహాము ఖండించిన ఖండముల మధ్య నడిచిపోయింది.

ఈ విధంగా అబ్రాహాము బలియర్పణలో అంతర్లీనంగా వున్న పాపపరిహారం ద్వారా అబ్రాహామును, అతని సంతానాన్ని తన స్వంత ప్రజలుగా చేసికొంటానన్న వాగ్ధానం నెరవేరింది. ఇంకా దేవుడు అబ్రాహాముతో యిలా వాగ్ధానం చేశాడు. ‘‘ఐగుప్తు నది మొదలుకొని గొప్పదియైన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యోబూసీయులను నీ సంతానమున కిచ్చియున్నాను” అన్నాడు. అబ్రాహాము బలియర్పణ ద్వారా అతని, అతని సంతానపు పాపాలను కడిగివేశాడని తెలియజేయడానికి దేవుడీ వాగ్ధానం చేశాడు. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్ధాన నెరవేర్పు వాక్యాన్ని పాత నిబంధన చరిత్ర అంతటిలో దేవుడు తెలియజేశాడు.

దేవుడు యేసేపును ఐగుప్తుకు ప్రధానిగా చేసి యాకోబు కుటుంబాన్ని విస్తరింజేయడానికి వారిని ఐగుప్తుకు నడిపించాడు. (ఆది 41:37-45,47). అయితే కాల గమనంలో యోసేపు ఐగుప్తుకు చేసిన బహుముఖ సేవలను ఎరుగని ఫరో రాజ్యానికి వచ్చినప్పుడు దేశంలో విస్తరిస్తున్న ఇశ్రాయేలీయులను హింసించడం ప్రారంభించి త్వరలోనే వారిని బానిసులుగా మార్చాడు. దాసులుగా పని చేసేట్టు బలవంతం చేశాడు (నిర్గమ 1:18-14). అయినా ఇశ్రాయేలీయులు విస్తరిస్తూనే వున్నారు. అందుకని వారిపై మరిన్ని భారాలు మోపి బానిసలుగా పనిచేయించాడు ఫరో. ఇలా ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఐగుప్తు దాస్యంలో బాధలనుభవించి చివరికి రక్షకుని కోసం ఎదురు చూశారు.

ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యం నుండి దేవుడు మోషే ద్వారా బయటికి నడిపించాడు (నిర్గమ 14:21-25). అలా ఐగుప్తు దాస్యం నుండి తప్పించుకొన్న ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా ప్రత్యక్ష గుడారపు బలియర్పణా విధానాన్ని యిచ్చి వారు అర్పణలను అర్పించుట ద్వారా వారి పాపాలను కడిగివేశాడు. అలా ఇశ్రాయేలీయులు దేవుని నుండి ధర్మశాస్త్రాన్ని (నిర్గమ 20), ప్రత్యక్ష గుడారపు బలియర్పణా విధానాన్ని పొందారు (లేవీ 1-4). ధర్మశాస్త్రం, ప్రత్యక్ష గుడారపు బలియర్పణా విధానం ద్వారా తమకు పాపక్షమాపణ కలుగుతుందని ఇశ్రాయేలీయులు తెలుసుకోగలిగారు. ఈ సత్యాన్ని నమ్మిన వారిని దేవుడు తన స్వంత ప్రజలుగా చేసుకొని, ఇశ్రాయేలీయులను యాజక రాజ్యంగా, దేవుని పరిశుద్ధ జాతిగా దీవించాడు (నిర్గమ 19:6)

బలియర్పణా విధానం ద్వారా నీకు ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని, కనాను దేశాన్ని యిస్తానని దేవుడు చేసిన వాగ్ధానాన్ని చివరికి మనం తెలుసుకోగలుగుతాం. ఇశ్రాయేలీయులు ఈజిప్టును (ఐగుప్తును) విడిచిపెట్టినప్పుడు యుద్ధం చేయగల 20సం.లు ప్రాయం దాటిన వారు వారిలో ఆరు లక్షలమంది వున్నారు. దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్ధానాన్ని తప్పక నెరవేరుస్తాడు.

అబ్రాహాము తన వాగ్ధాన వాక్యాన్ని నమ్మాడని తెలుసుకొన్న దేవుడు అతని విశ్వాసాన్ని ఆమోదించాడు. అతని విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడు. దేవునిలో అబ్రాహాముకున్న విశ్వాసానికి దేవుడు సంతృప్తి చెందాడు గనుక అబ్రహాము నుండి వచ్చి ఇశ్రాయేలీయులు ఒక జాతిగా చేయాలనుకొన్నాడు. బలియర్పణా విధానం ద్వారా సున్నతి వాగ్ధానం నెరవేర్చాడు.

అబ్రాహాము దేవునికి బలియర్పణ యిచ్చాడు గనుక దేవుడు అతని విశ్వాసాన్ని ఆమోదించాడు. మన క్రియల ద్వారా గాక దేవుని వాక్యంలో మన విశ్వాసం వలన మనకు పాపక్షమాపణ కలుగుతుందన్న విశ్వాసం మనకు కూడా అనుగ్రహించబడింది. అబ్రాహాములాగే బలియర్పణ ద్వారా తమ ఆత్మ సున్నతి తమ పాపాలను కడిగివేస్తుందన్న దేవుని వాక్యాన్ని ఎవరు నమ్ముతారో వారికి తన ఆశీర్వాదంగా కనాను దేశాన్ని అనుగ్రహిస్తాడు. అబ్రాహాముకు వున్న విశ్వాసాన్ని మన నుండి కూడా దేవుడు కోరుతున్నాడు. ఆయన అబ్రాహాములా హృదయ పూర్వకంగా దేవుని వాక్యాన్ని నమ్మి పాపక్షమాపణ పొంది దాని వలన దేవుని రాజ్యాన్ని స్వాధీనం చేసుకోమని నేడు దేవుడు నిన్ను నన్ను కోరుతున్నాడు. తండ్రియైన దేవుడు యేసుక్రీస్తు బాప్తిస్మం ద్వారా మన పాపాలను ఆయన మోసి మనందరి కొరకు ఆయనను ‘‘దేవుని గొర్రె పిల్లగా’’ (బలిపశువుగా) చేశాడు. అబ్రాహాములాగే మనం కూడా ఈ సత్యాన్ని నమ్మాలని దేవుడు కోరుతున్నాడు. అలా నమ్మినవారిని ఆయన శాశ్వతంగా తన ప్రజలనుగా చేసుకోవాలనుకుంటున్నాడు.

దేవుని వాక్యంలో అబ్రాహాముకు గల విశ్వాసాన్ని బట్టి దేవుడతన్ని గొప్పగా ఆశీర్వదించాడని మనకు చూపించాడు. అలాగే అబ్రాహాము విశ్వాసాన్ని కలిగి వుంటే నేడు నీవు నేను దేవుని దీవెనలు పొందుతాం. దేవుడు మోషేను సీనాయి పర్వతం విూదికి పిలిచాడు. ధర్మశాస్త్రాన్ని, బలియర్పణా విధానాన్ని యిచ్చాడు. దానిని నమ్మిన వారిని తన స్వంత ప్రజలుగా చేసుకొన్నాడు.

మనం దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించక తప్పిపోయినా ప్రత్యక్ష గుడారపు విధానంలో వున్న పాపక్షమాపణ ద్వారా మనలను ఆయన ప్రజలుగా చేసుకొన్నాడు. ప్రత్యక్షపు గుడారంలో ప్రత్యక్ష పరచిన సత్యాన్ని మనం విశ్వసించుట ద్వారా దేవుని నిత్యదీవెనలను మనం పొందేట్టు అనుగ్రహించాడు. ప్రత్యక్షపు గుడారంలో ప్రత్యక్ష పరచబడిన ఈ సత్యాన్ని నమ్ముట వలన మన మందరం దేవుని ప్రజలమైనాం. దేవుడు మనకు యేసుక్రీస్తును చూపించాడని, మన ప్రత్యక్ష గుడారం ద్వారా మనకు రక్షణ అనుగ్రహించాడని మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా నమ్ముతామో అప్పుడు మనం ఆయనిచ్చే సమృద్ధియైన ఆశీర్వాదమును పొందగలం.అబ్రాహాము దేవుని వాక్యాన్ని నమ్మినట్టే ఆయన వాక్యాన్ని మనం కూడా నమ్మాలి.


అబ్రాహాము తన మంచి పనుల వలన గాక దేవుని వాక్యంలో అతని విశ్వాసం వలన దీవించబడ్డాడు. ధర్మశాస్త్రం ద్వారా మన పాపాలను మనం తెలుసుకోగలిగేట్టు, బలియర్పణ విధానం ద్వారా మన పాపాలను నిర్దోషమైన బలిపశువు మీద మోపి దాని రక్తాన్ని దేవునికి అర్పించుట ద్వారా పాప క్షమాపణను పొందగలమని తెలుసుకోగలిగేట్టు చేశాడు దేవుడు. ఇలాగే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. తన బాప్తిస్మం ద్వారా మన పాపాలన్నింటిని తన మీదికి తీసుకొన్నాడు. సిలువ మరణం ద్వారా తీర్పు తీర్చబడ్డాడు. మృతులలో నుండి లేచుట ద్వారా మన పాపాలను క్షమించాడు. ఈ సత్యాన్ని నమ్ముట వలన మన పాపాలన్నీ క్షమించబడి మనం దేవుని పిల్లలమవుతాం. ఈ సత్యాన్ని ఎవరైతే హృదయపూర్వకంగా నమ్ముతారో వారు దేవుని దీవెనలన్నీ పొందుతారని బైబిలు చెబుతోంది. దేవుని వాక్యాన్ని నమ్ముట ద్వారా ప్రపంచంలో మరెక్కడా దొరకని విలువైన దీవెనలు అయిన ఆయన రక్షణ వాక్యాన్ని మన సొంతం చేసుకోగలుగుతాం.

అబ్రాహాము దేవుడు తనతో చెప్పిన దానిని నమ్మాడు గనుక దేవుని నుండి సమృద్ధియైన దీవెనలను పొందాడు. నేడు బైబిల్లోని దేవుని వాక్యాన్ని మనం నమ్మితే మనం కూడా అబ్రాహాముకున్న విశ్వాసాన్ని, అనేక పరలోక దీవెనలను పొందుతాం. ఇది చేయడం అంత కష్టమైన పనికాదు. మనం దేవుని ప్రజలమనడానికి ఋజువును కోరితే మనం మన భక్తి కార్యాల ద్వారా దేవుని సంతోషపరచడానికి ప్రయత్నించక, హృదయపూర్వకంగా ఆయన వాక్యాన్ని నమ్మాలి.

అబ్రాహాము సంతానానికి కనాను దేశాన్ని యిస్తానని దేవుడు అబ్రాహాముకు వాగ్ధానం చేశాడు. ఇప్పుడు జీవిస్తున్న మనం ప్రత్యక్ష గుడార నీలధూమ్ర రక్త వర్ణాల దారం, పేనిన సన్నని నారలో ప్రత్యక్షపరచబడి, ప్రవచించిన యేసుక్రీస్తు నాలుగు పరిచర్యలను నమ్మితే అది మన పాపాల నుండి మనలను రక్షిస్తుంది. దానిని నమ్మినప్పుడు మనం పాపక్షమాపణ పొందుతాం. దేవుని పిల్లలమవుతాం. పరలోక రాజ్యాన్ని వారసత్వాన్ని పొందుతాం.

దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకం కాదు. ఆయన వాక్యం సత్యం, మన విశ్వాసానికి ముఖ్యం. గనుక ఆయన వాక్యాన్ని మనం పూర్తిగా నమ్మాలి. నీరు ఆత్మలనే ఆయన వాక్యాన్ని తప్పక తెలుసుకోవాలి దానిని నమ్మాలి. అదే పరిపూర్ణ సత్యం! మరి విూరిప్పుడు నమ్ముతున్నారా? విూరు హృదయపూర్వకంగా దానిని నమ్మి నోటితో ఒప్పుకుంటే దేవుడు మిమ్ములను అంగీకరిస్తాడు. ‘‘ఏలయనగా నీతి కలుగునుట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును’’ (రోమా 10:10) ఇందుకు విశ్వాసం ముఖ్యమైనది. మనం హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని నమ్మడానికి దీనికెంతో ప్రాముఖ్యత వుంది. మనుష్యులు చెప్పినది నమ్మడం మనకు కష్టం గాని, లిఖితమైన దేవుని వాక్యాన్ని నమ్మడం కష్టం కాదు. మన సొంత ఆలోచనలు, భావోద్రేకాలతో దేవుని వాక్యం నమ్మడం కాదు గాని, నిజంగా హృదయ పూర్వకంగా వాక్యంలో వున్న దానిని వున్నట్టుగా నమ్మడం ముఖ్యం. ఇందుకనే దేవుని సేవకులు, ఇంతకు ముందు రక్షణ పొందినవారు దేవుని వాక్యాన్ని వున్నదున్నట్టుగా బోధిస్తున్నారు.

రాబోవు మెస్సీయ ఆయన యేసును నమ్మునట్లు సున్నతి గుర్తుతో అబ్రాహాము, ఆయన సంతానంతో దేవుడు నిబంధన చేశాడు. ప్రత్యక్ష గుడారపు బలియర్పణ విధానాన్ని యిచ్చాడు. ఆయన బాప్తిస్మం, సిలువ విూది రక్తం పాపాలను క్షమిస్తుంది. దీనిలో విశ్వాసం గలవారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు.

దేవుని నిబంధనా వాక్యాన్ని నేను నమ్ముతాను. దేవుని వాక్యాన్ని నమ్ముట ద్వారా అబ్రహామే గాదు, ఆయన వాక్యాన్ని నమ్మితే అబ్రాహాములాగే మనమందరం దీవించబడతాం. మన పాపాల నుండి మనలను రక్షించడానికి దేవుడే ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాడని నేను నమ్ముతాను. ఇందుకోసమే అబ్రాహాము సంతానాన్ని దేవుడు సీనాయి పర్వతం వరకు నడిపించి ధర్మశాస్త్రాన్ని, ప్రత్యక్షగుడారపు బలియర్పణా విధానాన్ని యిచ్చాడు. ఇది దేవుడు మన రక్షణ కొరకు ముందుగా చేసిన ఏర్పాటు అని మనం నమ్మాలి.